Miryalaguda: మిర్యాలగూడలో దోపిడీ దొంగల బీభత్సం.. మాజీ కౌన్సిలర్ ఇంట్లో భారీ చోరీ
- ఆదివారం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ముసుగు దొంగలు
- దంపతుల చేతులు కట్టేసి దోపిడీ
- రూ. 4 లక్షల నగదు, 30 తులాల ఆభరణాలు చోరీ
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మాజీ కౌన్సిలర్ ఇంట్లోకి చొరబడి అందినంత దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈదులగూడెం మాజీ కౌన్సిలర్ ముదిరెడ్డి సందీపారెడ్డి, ఆమె భర్త నర్సిరెడ్డి ఇంట్లోకి ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో దోపిడీ దొంగలు ప్రవేశించారు. ముసుగు ధరించిన నలుగురు దొంగలు ఇంటి ప్రధాన ద్వారాన్ని గడ్డపారతో పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. గదిలో నిద్రపోతున్న ఇద్దరినీ నిద్రలేపి అరవొద్దంటూ కత్తులు చూపించి బెదిరించారు. తాము నక్సలైట్లమని చెబుతూ ఇద్దరినీ బంధించి చేతులు వెనక్కి కట్టేశారు.
అనంతరం బీరువాలో ఉన్న 4 లక్షల రూపాయల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. సందీపారెడ్డిని అడిగి మరీ దిండుకింద దాచిన మంగళసూత్రాన్ని కూడా లాక్కున్నారు. 45 నిమిషాలపాటు ఇంట్లో బీభత్సం సృష్టించిన దొంగలు వెళ్తూవెళ్తూ వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు కూడా పట్టుకుపోయారు. బయటకు వస్తే చంపేస్తామని బెదిరించి పరారయ్యారు.
వారు వెళ్లిపోయిన తర్వాత బయటకు వచ్చిన బాధితులు ఎదురింటి వారి సెల్‌ఫోన్‌తో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు.