Andhra Pradesh: రాజధాని అమరావతికి నాడు 150 ఎకరాలు ఇచ్చిన దంపతులకు సన్మానం
- రాజధాని ప్రాంతంలో రైతులకు బీజేపీ నేతల మద్దతు
- దంపతుల కాళ్లు కడిగి ఆ నీళ్లను నెత్తిపై చల్లుకున్న నేత
- రాజధానిని మార్పు వల్ల కలిగే ఉపయోగమేంటో ప్రజలకు వివరించాలి
ఏపీ రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతుల నిరసనలు, ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మందడం-వెలగపూడిలో రైతుల నిరసనలకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతుల కాళ్లు కడిగిన బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ వారికి పాదాభివందనం చేశారు. రాజధాని కోసం 150 ఎకరాలు ఇచ్చిన సుబ్బారావు, నాగరత్నమ్మ దంపతులను సన్మానించారు. దంపతుల కాళ్లు కడిగి ఆ నీళ్లను తన తలపై చల్లుకున్నారు.
అనంతరం, మీడియాతో గోపాలకృష్ణ మాట్లాడుతూ, రాజధాని మార్పు విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. రాజధాని అమరావతిని మార్చడం వల్ల కలిగే ఉపయోగమేంటో ప్రజలకు ప్రభుత్వం వివరించి చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనేమీ వాటిని మార్చలేదని, ఈ విషయంలో జగన్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ, తమ బాధను ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలని కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దని అన్నారు.