GST: మారనున్న జీఎస్టీ శ్లాబ్స్... ధరలు పెరగనున్నవి ఇవే!
- జీఎస్టీ లొసుగులతో సాలీనా రూ. 20 వేల కోట్ల నష్టం
- రాబడిని పెంచడమే లక్ష్యంగా సిఫార్సులు
- కీలక సిఫార్సులు చేసిన జీఎస్టీ కమిటీ
- తదుపరి కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రాబడిని మరింత పెంచడమే లక్ష్యంగా ప్రస్తుతమున్న 5, 12, 18 శాతం శ్లాబ్ ల స్థానంలో 10, 20 శాతం శ్లాబ్స్ తీసుకు రావాలని అధికారుల కమిటీ కేంద్రానికి కీలక సూచనలు చేసింది. విలాస వస్తువులకు పన్నులను మరింతగా పెంచాలని సిఫార్సు చేసింది. కాస్మెటిక్స్ (సౌందర్య సాధనాలు), గ్యాంబ్లింగ్, రిక్రియేషనల్ సేవలపై సెస్ విధించాలని సూచించింది. పాఠశాల విద్య, వైద్య సేవలు, ఏసీ ప్రజా రవాణా వ్యవస్థలకు ఇస్తున్న మినహాయింపులను వెనక్కు తీసుకోవాలని కోరింది.
దీంతో ఏసీ బస్సులు, రైళ్లలో ప్రయాణంతో పాటు వివిద రంగాల్లోని క్లబ్ సేవలు, ఎడ్యుకేషన్ రంగాల్లో ప్రజలు మరింతగా చెల్లించుకోవాల్సిందే. లగ్జరీకి వినియోగించే వస్తువులపై పన్నులు ఎలా ఉండాలన్న విషయమై పూర్తి స్పష్టత ఇవ్వని కమిటీ, ప్రస్తుతానికి 28 శాతం శ్లాబ్ ను వర్తింపచేయరాదని, భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇక పలురకాల సెస్ రేట్లను పెంచాలని కూడా కమిటీ అభిప్రాయపడింది.
పలువురు వ్యాపారులు జీఎస్టీలోని లొసుగులను గుర్తించడంతో, ఏడాదికి దాదాపు రూ. 20 వేల కోట్ల ఆదాయం కేంద్ర ఖజానాకు చేరడం లేదని గుర్తించిన కమిటీ ఈ సిఫార్సులను తీసుకు వచ్చింది. ఇక వీటిపై తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం.