cm: జగన్మోహన్ రెడ్డి గారూ, ఆ వివరాలన్నీ చెప్పమంటారా?: టీడీపీ నేత దేవినేని ఉమ
- మీ పరిపాలనా వైఫల్యాన్ని మాకు అంటగడతారా?
- చంద్రబాబుని తిడితే రిజర్వాయర్లలో నీళ్లు వెళ్లవు
- నాటి సీఎం వైఎస్ టైమ్ లో అవుకు టన్నెల్ పనులు ఎందుకు ఆగిపోయాయి?
‘మీ పరిపాలనా వైఫల్యాన్ని మాకు అంటగడతారా?’ అంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడిని తిడితే రిజర్వాయర్లలోకి నీళ్లు వెళ్లవని, తమ హయాంలో వరదలు తక్కువగా వచ్చినా రిజర్వాయర్లలోకి నీళ్లు నింపామని, ఇందుకు సంబంధించిన లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పారు. గండికోట, బ్రహ్మసాగర్ కు నీళ్లు తీసుకెళ్లామని, అవుకు టన్నెల్ లెక్కలు జగన్ కు, తనకు బాగా తెలుసని అన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టెండర్లు పిలిస్తే.. మైనస్ 23 శాతం తక్కువకు టెండర్లు వేసినా ఆ కాంట్రాక్టర్ల మెడలు వంచి కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు.
‘జగన్మోహన్ రెడ్డి గారూ, ఆ వివరాలన్నీ చెప్పమంటారా? రాజశేఖర్ రెడ్డి గారి టైమ్ లో అవుకు టన్నెల్ పనులు ఎందుకు ఆగిపోయాయి? ఎందుకు బిల్లులు మీరు కట్టలేదు? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మీరేగా ఆరోజు పెత్తనాలు చేసింది. కమీషన్లు దండుకోవడానికి అవుకు టన్నెల్ పనులు పండబెట్టారు’ అని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన సీఎంలు కూడా అవుకు టన్నెల్ పనులు చేయడానికి సాహసం చేయలేదని అన్నారు. ‘మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా అవుకు టన్నెల్ పూర్తి చేసి అవుకు రిజర్వాయర్ కు, గండికోటకు 12 టీఎంసీలు నీళ్లు, పైడిపాలెం, చిత్రావతికి, పులివెందులకు నీళ్లు ఇచ్చాం’ అని అన్నారు.