YSRCP: అబ్బా! జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా చెప్పారు!: దేవినేని ఉమ సెటైర్లు
- ఓ ప్రాజెక్టు కట్టాలంటే ఎన్ని పనులు చేయాలో ఇప్పటిదాకా తెలియదా?
- సీఎం జగన్ కు ఇవాళే తెలిసిందా?
- ఏడు నెలల పరిపాలన చేసి చేతులెత్తారు
ఓ ప్రాజెక్టు కట్టాలంటే సర్వే చేయాలని, ఎస్టిమేట్స్ తయారు చేయాలని, బాధితులను తరలించాలని, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. ఇలా అన్ని నిబంధనలు పూర్తి కావాలంటే పది నెలల సమయం పడుతుందని సీఎం జగన్ చెబుతున్నారని, ‘అబ్బా! ఎంత బాగా చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు’ అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు.
ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ హయాంలో ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ని పనులు చేసి రూ.73 వేల కోట్లు ఎలా ఖర్చు పెట్టామో తెలిసిందా? ఇప్పటికైనా జ్ఞానోదయమైందా? అని ప్రశ్నించారు. ఏడు నెలల పరిపాలన చేసి చేతులెత్తారని, ఓ ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టాలంటే ఇన్ని పనులు చేయాలని ఇప్పటిదాకా తెలియదా? ఇవాళే తెలిసిందా? అంటూ ధ్వజమెత్తారు.
విశాఖపట్టణాన్ని ఉద్ధరిస్తానని చెబుతున్న జగన్, ‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతి’ పథకాన్ని ఎందుకు కేన్సిల్ చేశారు? వంశధార-నాగావళి పనులు ఎందుకు కేన్సిల్ చేశావు? శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఎందుకు ఆపివేశారు? ఈరోజున ఏ ముఖం పెట్టుకుని ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని చెబుతున్నారు? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మొదలైన పనులను తాను ఎందుకు చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో జగన్ ఉన్నారని, ఇది కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని అన్నారు.