Greater Rayalaseema: గ్రేటర్ రాయలసీమలో అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ క్యాపిటల్స్ ఉండాలి: మైసూరారెడ్డి డిమాండ్
- నిన్న రాయలసీమ నేతలం సమావేశమయ్యాం
- హైకోర్టును ఇచ్చి న్యాయ రాజధాని అంటే కుదరదు
- కనీసం ఏ ఒక్క క్యాపిటల్ అయినా ఇక్కడ ఉండాల్సిందే
గ్రేటర్ రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం జగన్ కు గ్రేటర్ రాయలసీమ నేతలు ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో మాజీ మంత్రి మైసూరారెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనను పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, నిన్న రాయలసీమకు చెందిన నేతలందరమూ సమావేశమైనట్టు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం కోసం గతంలో రాజధానిగా ఉన్న కర్నూలును త్యాగం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్ర పునర్విభజన జరిగినప్పుడు కూడా కర్నూలును రాజధానిగా చేయాలని కోరామని అన్నారు. ఇప్పుడు గ్రేటర్ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని నిన్న నిర్ణయం తీసుకున్న మేరకే తాము కోరుతున్నామని చెప్పారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాజధాని ఏర్పాటు చేసినట్టు కాదని అభిప్రాయపడ్డారు. అదీగాక, జీఎన్ రావు కమిటీ నివేదికలో రెండు చోట్ల హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిందని అన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ నుంచి హైకోర్టును ఏపీకి తరలిస్తున్న సమయంలో కనీసం దాన్ని అయినా కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ న్యాయవాదులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అంతమాత్రాన హైకోర్టును ఇక్కడ ఏర్పాటు చేసి న్యాయ రాజధాని అంటే కుదరదని, ‘మా వేళ్లతో మా కంటిని పొడవడమే అవుతుంది’ అని విమర్శించారు. రాజధానిలో అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ క్యాపిటల్స్ ఉంటాయని చెప్పారు. ఈ రెండింటిని గ్రేటర్ రాయలసీమలో ఏర్పాటు చేస్తే ఇంకా సంతోషిస్తామని, లేనిపక్షంలో ఏ ఒక్క క్యాపిటల్ అయినా ఇక్కడ ఉండాల్సిందే అని డిమాండ్ చేశారు.