Visakhapatnam: విశాఖ యువకుడి ఫిర్యాదుపై స్పందించిన ఒరియా నటి చిన్మయి ప్రియదర్శిని
- కటక్-భువనేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రవికుమార్
- తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు, నగలు తీసుకుందని ఆరోపణ
- అతడి ఆరోపణలు అవాస్తవమని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ నటి వివరణ
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు, నగలు తీసుకుని మోసం చేసిందంటూ విశాఖ యువకుడు రవికుమార్ పోలీసులకు చేసిన ఫిర్యాదుపై ఒరియా నటి చిన్మయి ప్రియదర్శిని స్పందించింది. తానెవరినీ మోసగించలేదని స్పష్టంచేసింది. ఫేస్బుక్లో పరిచయం అయిన అతడే తనతో స్నేహం పెంచుకున్నాడని, వైజాగ్ వచ్చినప్పుడు మర్యాదలు చేశాడని చెప్పుకొచ్చింది. పైపెచ్చు డబ్బులకు ఇబ్బందిగా ఉందని చెబితే తానే రూ.1.50 లక్షలు ఇచ్చానని, అందులోంచి రూ. 50 వేలు మాత్రమే ఇచ్చాడని, మిగతా డబ్బు ఇవ్వాల్సి ఉందని వివరించింది. పెళ్లి చేసుకుందామని అతడే తనకు ప్రతిపాదించాడని, తాను తిరస్కరించడంతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
విశాఖపట్టణానికి చెందిన పద్మరాజు రవికుమార్.. నటి చిన్మయిపై కటక్-భువనేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫేస్బుక్ ద్వారా ఆమె తనకు పరిచయం అయిందని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 2 లక్షల నగదు, బంగారు గొలుసు, ల్యాప్టాప్ తీసుకుని మోసగించిందని తన ఫిర్యాదులో ఆరోపించాడు. అతడి ఆరోపణలపై స్పందించిన నటి నిన్న భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చింది.