BJP: 'ఉగ్రవాది వెళ్లిపో' అంటూ నినాదాలు.. వర్సిటీలో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌కు చేదు అనుభవం.. వీడియో ఇదిగో
- మధ్యప్రదేశ్‌లోని మఖన్‌లాల్ చతుర్వేది జాతీయ వర్సిటీకి ప్రజ్ఞా
- నిరసనలో పాల్గొన్న విద్యార్థులను బుజ్జగించేందుకు వెళ్లిన ఎంపీ
- ప్రజ్ఞాకు వ్యతిరేకంగా నినాదాలు
మధ్యప్రదేశ్‌లోని మఖన్‌లాల్ చతుర్వేది జాతీయ విశ్వవిద్యాలయంలో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలపై యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా జర్నలిజం విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సర్ది చెప్పేందుకు ప్రజ్ఞా సింగ్ అక్కడకు వెళ్లారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు వెంటనే అక్కడికి వచ్చి 'ఉగ్రవాది వెనక్కి వెళ్లిపో' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలతో బీజేపీ మద్దతుదారులు వాగ్వివాదానికి దిగారు.
రంగ ప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి పంపించేశారు. తనను ఉగ్రవాది అని వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజ్ఞా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.