Benjamin Netanyahu: ఉగ్రవాదుల రాకెట్ దాడి.. పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇజ్రాయెల్ ప్రధాని!
- ఎన్నికల ప్రచారం సందర్భంగా రాకెట్ దాడి
- ధ్వంసం చేసిన డోమ్ రక్షణ వ్యవస్థ
- నెతన్యాహును హుటాహుటిన తరలించిన బలగాలు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు. దక్షిణ ఇజ్రాయెల్ లోని అష్కిలోన్ లో నిన్న రాత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా ఆయనపై రాకెట్ దాడి జరిగింది. గాజా వైపు నుంచి ఈ రాకెట్ దూసుకొచ్చింది. అయితే, ఇజ్రాయెల్ డోమ్ రక్షణ వ్యవస్థ మధ్యలోనే ఆ రాకెట్ ను ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, తన ప్రసంగం ప్రారంభమైన రెండు నిమిషాలకే నెతన్యాహు ప్రసంగాన్ని ఆపేశారు. భద్రతా సిబ్బంది ఆయనను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. పావుగంట తర్వాత ఆయన మళ్లీ వేదికపైకి వచ్చారు.
ఈ దాడిపై నెతన్యాహు స్పందిస్తూ, గతంలో రాకెట్ ప్రయోగించిన వాడు ఇప్పుడు లేడని చెప్పారు. ఇప్పుడు దాడి చేసిన వాడికి కూడా అదే గతి పడుతుందని అన్నారు. సెప్టెంబర్ లో కూడా నెతన్యాహును టార్గెట్ చేస్తూ ఒక రాకెట్ దాడి జరిగింది. రాకెట్ ను ప్రయోగించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ కమాండర్ అబూ అల్ అతాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) జరిపిన దాడుల్లో అబూ హతమయ్యాడు.