Andhra Pradesh: రాజధానిపై చంద్రబాబు, కన్నా, పవన్ కల్యాణ్ లపై ధ్వజమెత్తిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపణ
- ప్రతిపక్ష నేతలది ద్వంద్వ వైఖరి అంటూ మండిపాటు
- సీఎం ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయడన్న మంత్రి
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబు నిర్మించింది తాత్కాలిక భవనాలేనని స్పష్టం చేశారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తప్ప మిగిలినవి అద్దె భవనాలని అన్నారు. రాజధానిపై విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఇక్కడున్న చంద్రబాబు ఒకవిధంగా మాట్లాడితే, వైజాగ్ లో ఉన్న టీడీపీ నేత మరో విధంగా మాట్లాడతాడని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలోనూ చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబించాడని, ఆంధ్రా నేతలతో ఒకలా, తెలంగాణ నేతలతో మరోలా మాట్లాడించాడని ఆరోపించారు.
బీజేపీలోనూ అదే తీరు కనిపిస్తోందని, సీఎం జగన్ ప్రతిపాదనను మొదట స్వాగతించిన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత వ్యతిరేకిస్తూ మౌనదీక్షలు చేస్తానంటున్నాడని విమర్శించారు. బీజేపీలోనూ ఏపీ రాజధానిపై భిన్నధోరణులు ఉన్నాయని, కన్నా వ్యతిరేకిస్తుంటే, టీజీ వెంకటేశ్ స్వాగతిస్తున్నారని వెల్లంపల్లి వివరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ద్విపాత్రాభినయం చేస్తుంటాడని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందు రాయలసీమలో రాజధాని ఉండాలని చెప్పాడని, ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో తిరిగి ఓ రైతు పెట్టిన పెరుగన్నం కూడా తిన్నాడని తెలిపారు. ఆ సందర్భంగా మీ భూములు మీకు తిరిగిప్పించేస్తానంటూ పవన్ రైతులకు హామీ ఇచ్చాడని వెల్లంపల్లి గుర్తుచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిన వెంటనే చంద్రబాబుకు జై అన్నాడని తెలిపారు. ఈ విధంగా విపక్షాలన్నీ రాజధాని రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కానీ, సీఎం జగన్ ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయడని మంత్రి స్పష్టం చేశారు.