Perni Nani: దమ్ముంటే నిరూపించండి అంటూ సవాళ్లు విసురుతున్నారు, ఇప్పుడు వాళ్ల పాపం పండే రోజొచ్చింది: పేర్ని నాని
- మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో అన్ని వివరాలున్నాయన్న పేర్ని నాని
- అవినీతిపై న్యాయసలహా తీసుకుంటామని వెల్లడి
- లోకాయుక్త లేక సీబీఐ విచారణ జరిపే అవకాశం ఉందన్న మంత్రి
ఏపీ మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించిన విషయాన్ని వెల్లడించారు. అప్పటి ముఖ్యమంత్రికి వాటాలున్న ఓ సంస్థ కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు వారి కుటుంబీకులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు కూడా తేదీల వారీగా ఈ మంత్రివర్గ ఉపసంఘం నివేదికలో ఉన్నాయని తెలిపారు.
కారు డ్రైవర్లు, వారి ఇళ్లలో పనిచేసే తెల్లకార్డులున్న పనిమనుషుల పేర్ల మీద భూములు కొన్నారని పేర్ని నాని ఆరోపించారు. వీరందరూ రాజధాని ప్రకటన రాకముందే భూములు కొన్నవాళ్లని వివరించారు. ఇప్పుడు, దమ్ముంటే నిరూపించండి అంటూ సవాళ్లు విసురుతున్నారని, ఇప్పుడు వాళ్ల పాపం పండే రోజొచ్చిందని వ్యాఖ్యానించారు. న్యాయ సలహా తీసుకుని దీన్ని లోకాయుక్తకు అప్పగించడమా లేక సీబీఐకి అప్పగించడమా అనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.