Devineni Uma: ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనా? లేక విజయసాయిరెడ్డా?: దేవినేని ఉమ
- ఏ అర్హతతో రాజధానిని విజయసాయిరెడ్డి ప్రకటించారు?
- దొంగ లెక్కలు రాసేవాడు మా రాజధానిని ప్రకటిస్తాడా?
- అది కేబినెట్ బ్రీఫింగా? లేక కామెడీనా?
విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ మధ్యలో కూర్చొని రాష్ట్ర రాజధానిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. ఏ అర్హతతో రాజధానిని ఆయన ప్రకటించారని ప్రశ్నించారు. దొంగ లెక్కలు రాసేవాడు, జైలుకు వెళ్లిన వాడు తమ రాష్ట్ర రాజధానిని ప్రకటిస్తాడా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఎంత ధైర్యం, ఎంత కండకావరం, ఎంత అహంకారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగనా? లేక విజయసాయిరెడ్డా? అని ప్రశ్నించారు.
నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియాతో మీ మంత్రి మాట్లాడుతూ... 'వాడెవడు విజయసాయిరెడ్డి అని మాట్లాడారు' అని దేవినేని ఉమ అన్నారు. రాజధానిని ఆయన ప్రకటిస్తే మాకేంటి సంబంధం అన్నారని తెలిపారు. అది కేబినెట్ బ్రీఫింగా? లేక కామెడీనా? అనేది అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును తిట్టేందుకు మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు. విశాఖలో రాజధానిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తారా? లేదా? అనే విషయాన్ని జగన్ ను అడుగుతున్నానని చెప్పారు.