Atreya: ఆత్రేయ రాసిన ఆ పాటకి, పల్లవి అలా పుట్టుకొచ్చిందట
- ఆత్రేయ రాత్రివేళలో పాటలు రాసేవారు
- మంచి ఆలోచన తట్టడం కోసం కార్లో తిరిగేవారు
- ఆ మాటలో నుంచే ఆయన పాటను సృష్టించారన్న ఈశ్వర్
ఆత్రేయను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు."ఆత్రేయగారు 'ఆత్మబలం' సినిమా కోసం ఒక పాటను రాయవలసి వచ్చింది. ఆ పాట పల్లవిని ఎలా మొదలు పెట్టాలో తెలియక అయన ఆలోచనలో పడ్డారు. రాత్రివేళలోనే పాటలు రాయడం ఆయనకి అలవాటు. అసోసియేట్ తో కలిసి ఓ రోజు రాత్రి ఆయన 'మహాబలిపురం' బయలుదేరారు.
'మహాబలిపురం' వెళ్లి ఆలోచించినా పల్లవిలో మొదటి లైన్ ఆయనకి తట్టలేదు. దాంతో ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. మరుసటి రోజే రికార్డింగ్ ఉండటంతో, 'అరెరే తెల్లవారిపోతుందే' అని ఆత్రేయగారు అన్నారు. అప్పుడు అసోసియేట్ 'తెల్లవారిపోకుండా వుంటే బాగుండును కదండీ' అన్నాడు. అంతే .. ఆత్రేయ 'నా పాటకి పల్లవిని ఇచ్చేశావయ్యా' అంటూ 'తెల్లవారనీకు ఈ రేయిని ..' అంటూ పల్లవిని అందుకున్నారు. ఇలా సహజమైన సంఘటనల్లో నుంచి ఆత్రేయ పల్లవులను గ్రహించిన సందర్భాలు అనేకం వున్నాయి" అని చెప్పుకొచ్చారు.