Bay of bengal: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి.. కోస్తాలో వర్షాలు!
- ద్రోణి ప్రభావంతో నిన్న పలుచోట్ల తేలికపాటి వర్షాలు
- తేమ గాలుల వల్ల పెరిగిన చలి
- పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాలో వచ్చే రెండు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. త్రిపుర నుంచి ఒడిశాకు ఆనుకుని బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలోని పలు ప్రాంతాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
వచ్చే రెండు రోజుల్లోనూ అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణకేంద్రం తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదైనా, మేఘాల ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, తేమగాలులు వీస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా చలి పెరిగిందని వివరించింది.