Hyderabad: లండన్ లో పరిచయమైన వ్యక్తిని వెతికి మరీ చాటింగ్ చేసిన యువతి... రూ. 15 లక్షలకు ముంచేశాడు!
- ఫేస్ బుక్ లో పరిచయస్తుడిని వెతికిన యువతి
- బహుమతి పంపుతున్నానని నమ్మబలికిన వ్యక్తి
- పలు దఫాలుగా డబ్బు కట్టిన తరువాత పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
లండన్ లో తనకు పరిచయమైన ఓ వ్యక్తిని, ఫేస్ బుక్ లో వెతికి మరీ పరిచయం పెంచుకున్న హైదరాబాద్ యువతి దారుణంగా మోసపోయింది. సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన ఓ యువతి లండన్ లో చదువుకుంటున్న సమయంలో డాక్టర్ అజయ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్ కు వచ్చిన ఆమె, ఫేస్ బుక్ లో ప్రొఫైల్స్ వెతికి మరీ అతన్ని పట్టుకుని పరిచయం పెంచుకుంది. తెలిసిన వ్యక్తేనని ఫోన్ నంబర్ ను షేర్ చేసింది. నిత్యమూ ఇద్దరూ వాట్స్ యాప్, ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకునేవారు.
జనవరి ఫస్ట్ సందర్భంగా అతను, విలువైన బహుమతిని పంపుతున్నానని చెప్పి ఆమెలో ఆశలు పెంచాడు. కస్టమ్స్ వాళ్లు ఏవైనా సుంకాలు చెల్లించాలని సూచిస్తే, కట్టి, దాన్ని తీసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో ఢిల్లీ కస్టమ్స్ కార్యాలయం నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. 5 లక్షల పౌండ్లున్న బాక్స్ బహుమతిగా వచ్చిందని, రూ. 2.50 లక్షలు పన్ను చెల్లించి, దాన్ని తీసుకోవచ్చని చెబితే, నమ్మిన బాధితురాలు డబ్బు పంపింది.
ఆపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కు మరో రూ. 2.50 లక్షలు కట్టాలని చెబితే పంపింది. ఇలా పలు దఫాలుగా ఆమె నుంచి రూ. 15 లక్షలు వసూలు చేశారు. ఎండ డబ్బు పంపినా బహుమతి రాకపోవడంతో అనుమానంతో అజయ్ కి ఫోన్ చేయగా, స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని భావించిన ఆమె, పోలీసులను ఆశ్రయించింది.