Ivanka Trump: మా నాన్న మళ్లీ గెలిస్తే, వైట్ హౌస్ లో ఉండబోను: ఇవాంకా ట్రంప్

  • వచ్చే సంవత్సరంలో అమెరికాలో ఎన్నికలు
  • ప్రస్తుతం తండ్రికి సలహాదారుగా ఉన్న ఇవాంకా
  • ఇకపై పిల్లల గురించి ఆలోచిస్తానంటున్న ఇవాంకా

2020లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే, తాను వైట్ హౌస్ లో ఉండబోనని ఇవాంకా ట్రంప్ సూచన ప్రాయంగా తెలిపారు. ప్రస్తుతం ఇవాంకా తన తండ్రికి సలహాదారుగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా, 'సీబీఎస్' కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోదఫా తండ్రికి సలహాదారుగా కొనసాగుతారా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇచ్చిన ఆమె, ఇకపై తన పిల్లలు, వారి సంతోషంలో భాగం కావాలని ఉందని, వారికే తన తొలి ప్రాధాన్యతని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే తన నిర్ణయం ఉంటుందని, పిల్లల బాగోగులు చూసుకోవడంలోనే తనకు ఆనందమని అన్నారు. మీ ప్రశ్నకు సమాధానం తన పిల్లల నుంచే వస్తుందని తెలిపారు.

తన విధుల ప్రభావం వారి జీవితాలపై ఉండకుండా చూడాలని భావిస్తున్నట్టు తెలిపారు. గత రెండున్నరేళ్లుగా తాను ప్రయాణిస్తూనే అత్యధిక సమయం గడిపానని, దేశం కోసం సేవ చేశానని, ఇప్పుడు తన పిల్లలు వారి అవకాశాలను వెతుక్కునేందుకు సహకరిస్తానని అన్నారు. ఇదే సమయంలో తండ్రికి సలహాదారుగా తాను చాలా చేశానని, అయినా, ఇంకా తన పని పూర్తి కాలేదనే భావిస్తున్నానని అన్నారు. రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదంటూనే, తన భర్త జారెడ్ కుష్ నర్ తో కలిసి పిల్లలను చూసుకుంటూ ఉండటమే ఇష్టమని 38 ఏళ్ల ఇవాంక వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News