Narendra Modi: విపక్ష పార్టీలన్నింటికీ అభినందనలు: 'మన్ కీ బాత్'లో నరేంద్ర మోదీ
- 2019లో చివరి 'మన్ కీ బాత్' ప్రసంగం
- పార్లమెంట్ కు సహకరించిన విపక్ష ఎంపీలకు అభినందనలు
- దేశాభివృద్ధికి కృషి చేస్తున్న యువత
- స్థానిక ఉత్పత్తులనే కొనాలని ప్రజలకు మోదీ పిలుపు
గడచిన పార్లమెంట్ సెషన్ పూర్తి ఫలవంతంగా నడిచిందని, కీలక బిల్లులను ఆమోదించేందుకు సహకరించిన ప్రతిపక్ష పార్టీలకు ఎంపీలకు తాను అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆల్ ఇండియా రేడియో వేదికగా, 2019 చివరి 'మన్ కీ బాత్' ప్రసంగం చేశారు. ఖగోళ విభాగంలో ఇండియా అనిర్వచనీయమైన విజయాలను సాధిస్తోందని, ఇందుకు శాస్త్రవేత్తలందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. బీహార్ అభివృద్ధి కోసం ప్రారంభించిన 'సంకల్ప్ 95' సత్ఫలితాలను అందిస్తోందని తెలిపారు. ఎన్నో స్కూళ్లు, పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు సమావేశాలు జరుపుతూ, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారి విలువైన సలహాలు, సూచనలు ఎంతో ఉపకరిస్తున్నాయని అన్నారు.
దేశ ప్రజలంతా సాధ్యమైనంత వరకూ స్థానికంగా తయారైన వస్తు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నరేంద్ర మోదీ సూచించారు. జమ్మూకశ్మీర్ యువత జీవితాలను మార్చేందుకు ప్రారంభించిన వినూత్న కార్యక్రమం 'హిమాయత్' విజయవంతమైందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం శ్రమించిన సమర వీరులకు నివాళులు అర్పిస్తూ, తన ప్రసంగాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ, కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్ ను నిర్మించి 50 సంవత్సరాలు అయిందని, దేశ యువత కనీసం ఒక్కసారైనా, ఈ మహోన్నత నిర్మాణాన్ని తిలకించి రావాలని అభిలషించారు. ఎన్నో విషయాల్లో యువ ఔత్సాహికులు సమాజానికి ఉపయోగకరమైన ఆవిష్కరణలు చేస్తున్నారని మోదీ అన్నారు. దేశ ఆధునికీకరణ, అభివృద్ధి అంశాల్లో యువతే కీలకమని, వారి నుంచి కొత్త సంవత్సరంలో భరతమాత మరెంతో కోరుకుంటోందని అన్నారు. దేశ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.