vice president: తెలుగువారు గర్వించదగ్గ నేత మర్రి చెన్నారెడ్డి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేని
- ఎన్ని విమర్శలు చేసినా చెన్నారెడ్డి ఓపికగా వినేవారు
- హైదరాబాద్ లో చెన్నారెడ్డి శతాబ్ది జయంతి ఉత్సవాలు
చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి శతాబ్ది జయంతి ఉత్సవాలను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఎన్ని విమర్శలు చేసినా చెన్నారెడ్డి ఓపికగా వినేవారని, తెలుగువారు గర్వించదగ్గ నేత చెన్నారెడ్డి అని కొనియాడారు.
ఎన్ ఆర్సీ, సీఏఏలపై దేశ వ్యాప్తంగా తలెత్తుతున్న నిరసనల గురించి వెంకయ్యనాయుడు ప్రస్తావిస్తూ, విధ్వంసకర పద్ధతిలో నిరసనలు తెలపడం సరికాదని అన్నారు. హింసాయుతమార్గం నాగరికం కాదని సూచించారు. రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల్లా ఉండాలి కానీ, శత్రువుల్లా కాదని, వ్యక్తిగత దూషణలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెలతాయని అన్నారు. రాజకీయ చర్చలు హుందాగా జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏఐసీసీ నేత కుంతియా, మాజీ గవర్నర్ రోశయ్య తదతరులు పాల్గొన్నారు.