Kanna: నాకు తెలిసి వచ్చే ఐదేళ్లలో జగన్ శంకుస్థాపన కూడా చేయలేరు: కన్నా
- న్యూస్ చానల్ తో మాట్లాడిన కన్నా
- సీఎం జగన్ పై విమర్శలు
- వచ్చే ఐదేళ్లలో ఒక్క శంకుస్థాపన కూడా చేయలేరని వ్యాఖ్యలు
ఏపీలో ఇప్పుడు ఏ రాజకీయ పక్షాన్ని కదిలించినా రాజధాని గురించి తప్ప మరో మాట మాట్లాడడంలేదు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజధాని అంశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు. 2014లో అప్పటి ప్రభుత్వం ఫలానా చోట రాజధాని నిర్మించాలనుకుని, తీర్మానం చేసి ప్రధానమంత్రిని నమ్మించారని తెలిపారు. నాడు రాజధానిపై చేసిన తీర్మానంలో జగన్ కూడా భాగస్వామి అని, ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపితే ప్రధాని దాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారని వివరించారు. కానీ ఇప్పుడు రాజధానిని మార్చుతుంటే న్యాయపరమైన పోరాటానికైనా తాము సిద్ధమేనని అన్నారు.
"జగన్ కు అనుభవ రాహిత్యం, అవగాహన రాహిత్యానికి తోడు ఇగోయిజం కూడా ఉంది. వీటన్నింటికి తోడు ఆత్రం! ఇవన్నీ కలిసి జగన్ ను ఈ ఆర్నెల్లలో విఫల సీఎంగా నిలిపాయి. జగన్ ఇప్పుడొచ్చి విశాఖను అభివృద్ధి చేసేదేమీ ఉండదు. ఇప్పటికే విశాఖ ఎంతో అభివృద్ధి చెందింది. అక్కడేదో సచివాలయం నిర్మించినంత మాత్రాన అభివృద్ధి చెందదు. నాకు తెలిసినంతవరకు వచ్చే ఐదేళ్లలో జగన్ శంకుస్థాపన కూడా చేయలేరు" అంటూ వ్యాఖ్యానించారు.