Harsha Kumar: మాజీ ఎంపీ హర్షకుమార్ ను అరెస్ట్ చేయాలని ఒత్తిడి తెచ్చారు... సంచలనం రేపుతున్న పోలీసు ఎస్ఐ వీడియో!
- ఒత్తిడి తెచ్చినందునే ఎఫ్ఐఆర్
- హర్షకుమార్ వద్ద అంగీకరించిన ఎస్ఐ
- వీడియో తీసి మీడియాకు ఇచ్చిన కుటుంబీకులు
మాజీ ఎంపీ హర్షకుమార్ అరెస్ట్ వెనుక పోలీసులపై ఒత్తిడి ఉందన్న ఒక సంచలన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఓ ఎస్ఐ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరిస్తుండగా, దాన్ని వీడియో తీసిన హర్షకుమార్ కుటుంబీకులు, దాన్ని మీడియాకు అందించారు. ఆ వీడియోలో.. తనపై ఎంతో ఒత్తిడి తెచ్చినందునే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశానని సదరు ఎస్ఐ అంగీకరిస్తున్నాడు. ఆ సమయంలో ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్న హర్షకుమార్, ఆరోగ్యం బాగాలేకుండా, చికిత్స పొందుతుంటే, ఎలా అరెస్ట్ చేస్తారని, మీ తండ్రి అయితే ఇలానే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
మరోపక్క వైద్యులు వద్దంటున్నా తన తండ్రిని బలవంతంగా జైలుకు తరలిస్తున్నారని శ్రీరామ్ ఆరోపించారు. తమ తండ్రిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. లేవలేని స్థితిలో ఉన్న ఆయన్ను జైలుకు ఎలా తీసుకుని వెళ్తారని ప్రశ్నించారు. తన తండ్రిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఆ ఎస్ఐ, స్వయంగా తమ వద్దకు వచ్చి అరెస్ట్ అక్రమమేనని అంగీకరించాడని అన్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.