new year: 31న జర భద్రం.. మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే కటకటాలే: మాదాపూర్ పోలీసుల హెచ్చరిక
- వేడుకలు శ్రుతి మించొద్దు
- ఈవెంట్లకు పోలీసుల అనుమతి తప్పనిసరి
- గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదే
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మాదాపూర్ పోలీసులు హెచ్చరించారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే వేడుకల్లో గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదేనని మాదాపూర్ సీఐ వెంకట్‌రెడ్డి అన్నారు.
31న అర్ధరాత్రి వాహనాలను వేగంగా నడిపినా, ఇతరులను వేధింపులకు గురిచేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. యువతీయువకులు శ్రుతి మించకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించే వారిపై చర్యలు తప్పవన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఈవెంట్లను నిషేధించినట్టు తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, పార్కింగ్‌కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సీఐ సూచించారు.