SCR: రైల్లో ట్యాబ్ పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చున్న అమ్మాయి... ఫొటో చూసి వెతికి తెచ్చిపెట్టిన రైల్వే శాఖ!
- దురంతో రైల్లో విశాఖ నుంచి వచ్చిన అమ్మాయి
- ట్విట్టర్ లో తన బిడ్డ బాధను తెలిపిన తండ్రి ముస్తఫా
- ట్యాబ్ ను తిరిగి తెచ్చిచ్చిన అధికారులు
రైల్లో తాను ప్రేమగా చూసుకుంటున్న ట్యాబ్ ను పోగొట్టుకున్న ఓ అమ్మాయి, ఏడుస్తూ కూర్చుంటే, అమ్మాయి తండ్రి ఆ ఫొటో తీసి ట్విట్టర్ ఖాతాలో పెట్టాడు. దాన్ని రైల్వే శాఖకు ట్యాగ్ చేశాడు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు, ఆ ట్యాబ్ ను వెతికి పట్టుకుని ఆ అమ్మాయికి అందించారు.
టెక్నాలజీ ఎంతగా ఉపకరిస్తుందన్న విషయానికి ఈ ఘటన మరో ఉదాహరణ. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన ముస్తఫా సాదిఖ్ అనే వ్యక్తి, సోమవారం నాడు తన కుమార్తె ఏడుస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ ఓ కామెంట్ పెట్టారు. విశాఖపట్నం నుంచి దురంతో ఎక్స్ ప్రెస్ లో తన బిడ్డ నగరానికి వచ్చిందని, బి-11 కోచ్, సైడ్ అప్పర్ బెర్త్ లో ప్రయాణించిన ఆమె, అక్కడే ట్యాబ్ ను పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుందని చెప్పారు. తమకు సహాయం చెయ్యవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇక ఈ ట్వీట్ వైరల్ కావడంతో పలువురు రీట్వీట్ చేయగా, అధికారులు స్పందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న దురంతో ఎక్స్ ప్రెస్ లో ట్యాబ్ దొరుకుతుందేమోనని అధికారులు, సిబ్బంది సాయంతో వెతికించారు. ట్యాబ్ ను కనిపెట్టే పనిలో ఉన్నామని ముస్తఫాకు సమాధానం చెప్పారు. ట్యాబ్ వివరాలు కావాలని అడిగారు.
ఆపై విద్యాసాగర్ అనే రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగికి ట్యాబ్ దొరికింది. దానిని ఆయన అధికారులకు అప్పగించారు. ఆపై విషయాన్ని ముస్తఫాకు తెలిపిన అధికారులు, మీ పాప మొహంలో మళ్లీ నవ్వులు చిందుతాయని, ట్యాబ్ దొరికిందని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ ను కలిసి ట్యాబ్ తీసుకోవాలని తెలిపారు.