GN Rao Committee: జీఎన్ రావు కమిటీ నివేదికలో ఇదే ఉంది: పవన్ కల్యాణ్
- అసెంబ్లీని భీమిలీలో పెట్టాలని లేదు.. విజయనగరంలో పెట్టాలని ఉంది
- హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు
- 151 సీట్లు శాశ్వతం కాదు
హైకోర్టును తరలించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని... ఆ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కర్నూలుకు హైకోర్టును తరలిస్తామంటూ రాయలసీమ ప్రజలను కూడా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. లెజిస్లేటివ్ అసెంబ్లీని విజయనగరంలో పెట్టాలని జీఎన్ రావు కమిటీ చెప్పిందని... విశాఖలోని భీమిలిలో పెట్టాలని చెప్పలేదని అన్నారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 'భూములు అమ్ముకోవడానికో, దేనికో... రకరకాల ఆలోచనలు. వారి బుర్రలో ఏముందో నాకే అర్థం కావడం లేదు' అని అన్నారు. ఎర్రబాలెంలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి ప్రాంత మహిళలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి... రోడ్లపై ఆందోళనలు చేయడం బాధిస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులను వైసీపీ నేతలు పశువులుగా అభివర్ణిస్తుండటం దారుణమని అన్నారు. ఏ గొడవైనా మొదట చిన్నగానే ప్రారంభమవుతుందని... నెమ్మదిగా తీవ్ర రూపం దాల్చుతుందని తెలిపారు. అమరావతి రైతులు పోరాటాన్ని ఆపకూడదని, ఇలాగే కొనసాగించాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాటాన్ని పోలీసు శాఖ మానవతా దృక్పథంతో చూడాలని అన్నారు. 151 సీట్లు శాశ్వతం కావని... అవి ఎప్పుడైనా పోవచ్చని చెప్పారు.