India: భారత్ సరిహద్దు వ్యాప్తంగా మొబైల్ సేవలు నిలిపివేసిన బంగ్లాదేశ్
- 'ప్రస్తుత పరిస్థితులే కారణం' అంటూ మొబైల్ ఆపరేటర్లకు ఆదేశాలు
- కోటి మంది యూజర్లపై ప్రభావం
- సరిహద్దు పొడవునా కిలోమీటర్ పరిధిలో నిలిచిన మొబైల్ సేవలు
భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్ సరిహద్దు పొడవునా మొబైల్ సేవలను నిలిపివేయాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. భారత్ లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల కారణంగా బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం కారణంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని కోటి మంది మొబైల్ యూజర్లపై ప్రభావం పడనుంది. భారత్ తో సరిహద్దులో కిలోమీటరు పరిధిలో మొబైల్ ఆపరేటర్లు సిగ్నల్ నిలిపివేసినట్టు బంగ్లా పత్రిక ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది.
తాము తదుపరి ఆజ్ఞలు జారీ చేసేవరకు మొబైల్ ఆపరేటర్లు తమ సేవలు నిలిపివేయాలని బంగ్లాదేశ్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్ (బీటీఆర్సీ) స్పష్టం చేసింది. భారత్ లో ప్రస్తుతం పౌరసత్వ సవరణ చట్టం, ఎన్సార్సీ, ఎన్ పీఆర్ లపై తీవ్రస్థాయిలో నిరసనలు, ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ఈ తరహా ఆదేశాలు రావడం గమనార్హం.