Farmers letters: కారుణ్య మరణాలు ప్రసాదించాలంటూ రాష్ట్రపతికి రైతుల లేఖలు
- రాజధాని అంశంలో మోసపోయాం
- మూడు రాజధానుల ప్రకటనతో రోడ్డున పడ్డాం
- అండగా నిలవాల్సిన ప్రభుత్వమే కక్ష కట్టింది
ఏపీ రాజధాని మార్పు జరుగుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అమరావతి రైతులు లేఖలు రాశారు. తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని తమ లేఖల్లో కోరారు. రాజధాని అంశంలో తాము మోసపోయామని రైతులు పేర్కొంటూ.. తమకు చనిపోయేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో తాము రోడ్డున పడ్డామని లేఖలో ఆవేదనను వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారని పేర్కొన్నారు. కొందరి సొంత లాభంకోసమే రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని రైతులు లేఖలో ఆరోపించారు. తమ త్యాగాన్ని అధికార పార్టీ నేతలు అవహేళన చేస్తున్నారని తెలిపారు. వైసీపీ నేతలను ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని.. అంతేకాక, పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందన్నారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే తమపై కక్ష కట్టిందన్నారు.