priyanka gandhi: ప్రియాంక.. ఓ నకిలీ గాంధీ: కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి
- కాషాయాన్ని ప్రియాంక అర్థం చేసుకోలేరు
- ఆమె తన పేరు మార్చుకోవాలి
- చౌకబారు విమర్శలు మానుకోవాలి
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నిప్పులు చెరిగారు. ప్రియాంక ఓ నకిలీ గాంధీ అని, ఈ గాంధీలు కాషాయాన్ని అర్థం చేసుకోలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన పేరు నుంచి గాంధీని తొలగించుకోవాలని డిమాండ్ చేశారు.
సోమవారం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కాషాయం ధరించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పడం భావ్యం కాదన్నారు. కాషాయమంటే మత సామరస్యానికి, ఆధ్యాత్మికతకు, హిందూ ధర్మానికి ప్రతీక అని, అది ఆయన వ్యక్తిగతం కాదని ప్రియాంక పేర్కొన్నారు. కాషాయం ధరించిన యోగి నియమాలు పాటించాల్సిందేనని అన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ప్రతీకారం తీర్చుకుంటానని అనడం సరికాదని ప్రియాంక అన్నారు.
ఆమె వ్యాఖ్యలపై స్పందించిన సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. కాషాయాన్ని ప్రియాంక అర్థం చేసుకోలేరని, ఎందుకంటే ఆమె నకిలీ గాంధీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరస్థులపై చర్యలు తీసుకుంటుంటే ప్రియాంకకు సమస్యలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. అందుకనే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు.