Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. పానీపూరీలో ఉల్లి వేయలేదని వ్యాపారి తల పగలగొట్టిన ఆటో డ్రైవర్!
- ఉల్లిపాయలు లేకుండా ఇచ్చిన వ్యాపారి
- తిన్నా, తినకున్నా డబ్బులు ఇవ్వాల్సిందేనన్న బండి నిర్వాహకుడు
- ఇద్దరి మధ్య ఘర్షణ.. తొలుత దాడిచేసిన వ్యాపారి
పెరుగుతున్న ఉల్లిధరలు ప్రాణాలు తీస్తున్నాయి. పానీపూరీలో ఉల్లిపాయలు వేయలేదన్న కారణంతో ఓ ఆటో డ్రైవర్.. వ్యాపారి తల పగలగొట్టాడు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ వీరన్న.. నిన్న సాయంత్రం బాపూనగర్ చౌరస్తాలోని పానీపూరీ బండి వద్దకు వెళ్లి పానీపూరీ అడిగాడు.
ఉల్లిపాయలు లేకుండానే పానీపూరీని వీరన్న చేతిలో పెట్టాడు నిర్వాహకుడు. దీంతో తనకు అవసరం లేదని వీరన్న అక్కడే వాటిని వదిలిపెట్టేశాడు. ఉల్లి ధర పెరగడంతో వేయలేకపోయానని నిర్వాహకుడు సర్దార్ పవార్ చెప్పినా వీరన్న వినిపించుకోలేదు. పానీపూరీ ప్లేట్‌ను అక్కడే పెట్టేసి వెళ్లిపోబోయాడు. దీంతో వాటిని తిన్నా, తినకున్నా తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందేనని పవార్ పట్టుబట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
అది తారస్థాయికి చేరుకోవడంతో ఆటో డ్రైవర్ వీరన్నపై పవార్ దాడికి దిగాడు. తనపై దాడికి దిగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వీరన్న ఆటోలోని ఇనుప రాడ్డు తీసుకుని సర్దార్ తలపై గట్టిగా మోదాడు. దీంతో తీవ్ర గాయాలతో సర్దార్ కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయాల పాలైన సర్దార్‌ను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ వీరన్నను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.