Bonda Uma: ఇప్పుడే డాక్యుమెంట్లు తీసుకువని వస్తా... తేల్చుకుందాం: వైసీపీ నేతలకు బోండా ఉమ సవాల్
- రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ వైసీపీ ఆరోపణలు
- ఇన్ సైడర్ ట్రేడింగ్ కు అర్థం చెప్పిన బోండా ఉమ
- నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దని హితవు
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న అంబటి రాంబాబు, వైసీపీ ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. టీడీపీ నేతలపై అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బోండా ఉమ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కంపెనీల చట్టం చదివి ఇన్ సైడర్ ట్రేడింగ్ అనేది దేనికి వర్తిస్తుందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఓ కంపెనీలోని డైరెక్టర్లు కానీ, సీఈఓ కానీ అంతర్గత సమాచారాన్ని లీక్ చేస్తే సెబీ పరిధిలో కంపెనీల చట్టం యాక్ట్ ప్రకారం ఇన్ సైడర్ ట్రేడింగ్ గా భావిస్తారని ఉమ వివరించారు. ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కానీ, భూములకు సంబంధించిన అంశం కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ముందు ఈ విషయం తెలుసుకోవాలని సూచించారు.
"నాలుగు వేల ఎకరాలు కొన్నారని మీ నొటికొచ్చినట్టు మాట్లాడారు. మీ మీడియాలో కూడా ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎంతమంది ఆ భూములు ఎక్కడెక్కడ కొన్నారన్నది మా వద్ద పత్రాలు ఉన్నాయి. వేమూరి రవి ఓ ఎన్నారై. ఆయన 2004-05లో ఆరెకరాల భూమి కొన్నారు. తర్వాత 2014లో దాని పక్కనే మరో ఏడు ఎకరాల భూమి కొన్నారు. కానీ, వేమూరి రవిని లోకేశ్ బినామీ అంటున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు.
ఇక, బాలకృష్ణ గారి వియ్యంకుడు రామారావుపైనా ఇదే విధంగా బురద చల్లుతున్నారు. ఆయన 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఫర్టిలైజర్ కంపెనీ కోసం దరఖాస్తు చేసుకుంటే జగ్గయ్యపేట వద్ద జయంతీపురంలో భూమి కేటాయించారు. అయితే ఇప్పటికీ తమకు ఆ భూమిని అందించలేదని రామారావుగారబ్బాయి భరత్ స్పష్టంగా చెబుతున్నాడు. అసలా భూమి తమకు వద్దని, తమ డబ్బులు తమకు వాపసు ఇవ్వాలని భరత్ అంటున్నాడు. కానీ దీన్ని కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన బావమరిదికి, ఆయన వియ్యంకుడికి ఉచితంగా 500 ఎకరాలు కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ పరిశ్రమల కోసం వేల ఎకరాలు ఇచ్చారు. అవన్నీ తీసుకువచ్చి టీడీపీ ప్రభుత్వానికి అంటకడుతున్నారు.
ఆఖరికి హెరిటేజ్ కంపెనీపైనా ఇలాంటి ప్రచారమే చేస్తున్నారు. ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సండూర్ పవర్ లాగా ప్రైవేటు కంపెనీయో, ప్రొప్రయిటర్ ఫర్మ్ కాదు, బినామీ కంపెనీ అంతకన్నా కాదు. సెంటు భూమి కొనాలన్నా డైరక్టర్ల ఆమోదం ఉండాలి. ప్రతి విషయం లిఖితపూర్వకంగా చూపించాలి. హెరిటేజ్ ఫుడ్స్ కోసం ఐదు చోట్ల చిల్లింగ్ సెంటర్ల కోసం భూమి కొనేందుకు నిర్ణయించుకుంటే దాన్ని తీసుకువచ్చి చంద్రబాబు కంపెనీ రాజధానిలో భూములు కొనేసిందని అవాస్తవాలు మాట్లాడుతున్నారు" అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
"మీరు వైసీపీ కార్యాలయంలోనే ఉన్నారు కదా! డాక్యుమెంట్లు తీసుకుని నేనిప్పుడే వస్తున్నా. నిజానిజాలేంటో తేల్చుకుందాం! రేపో ఎల్లుండో వద్దు, ఇవాళే మీడియా ముందు చూసుకుందాం. మీకేమైనా ఇవాళ డీల్స్ కుదుర్చుకునే టైమయిందా, అలాగైతే రేపు అయినా సిద్ధమే! మీ కార్యాలయానికే వస్తాం" అంటూ సవాల్ విసిరారు.