Giriraj Singh: సంపన్న కుటుంబాల పిల్లలు విదేశాలకు వెళ్లి, గొడ్డు మాంసం తింటున్నారు!: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
- మిషనరీ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఉన్నతమైన కెరీర్ ను సొంతం చేసుకుంటున్నారు
- కానీ వారికి మనం సంస్కారాన్ని మాత్రం నేర్పించలేకపోతున్నాం
- ప్రైవేట్ పాఠశాలల్లో భగవద్గీతను బోధించాలి
సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మనం సంస్కారాన్ని నేర్పించలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వీరంతా విదేశాలకు వెళ్లినప్పుడు గొడ్డు మాంసం తింటున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ పాఠశాలల్లో భగవద్గీతను బోధించాలని ఆయన డిమాండ్ చేశారు.
మిషనరీ స్కూళ్లలో చదువుతున్న సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువులో అద్భుత ప్రగతిని సాధిస్తున్నారని, ఉన్నతమైన కెరీర్ ను సొంతం చేసుకుంటున్నారని... అయితే, వీరు విదేశాలకు వెళ్లినప్పుడు గొడ్డు మాంసం తింటున్నారని గిరిరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మనం సంస్కారాన్ని నేర్పకపోవడమే దీనికి కారణమని అన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో భగవద్గీతను బోధిస్తే వారిలో మార్పు వస్తుందని చెప్పారు.
ఇదే సమయంలో దేశంలోని మైనార్టీలపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనం చీమలకు పంచదార వేస్తామని, పాములకు పాలు పోస్తామని... కానీ, అవే పాములు మనల్ని భయపెట్టాలని చూస్తున్నాయని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను పాకిస్థాన్ స్పాన్సర్ చేస్తోందని... మన దేశాన్ని బలహీనపరిచేందుకు యత్నిస్తోందని విమర్శించారు.