Tirumala: నేరుగా వైకుంఠ ద్వార దర్శనం... 2,500 టికెట్లు విడుదల చేసిన టీటీడీ!

  • ఈ నెల ఆరున వైకుంఠ ఏకాదశి
  • శ్రీ వాణి ట్రస్ట్ కు రూ. 10 వేలు ఇస్తే, నేరుగా దర్శనం
  • వెల్లడించిన అనిల్ కుమార్ సింఘాల్

ఈ నెల 6, 7 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని నేరుగా దర్శించుకోవాలని భావించే భక్తుల కోసం 2,500 టికెట్లను విడుదల చేసినట్టు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. శ్రీ వాణి ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చే భక్తులకు ఈ టికెట్లను అందిస్తామని ఆయన తెలిపారు. రూ. 10 వేలు విరాళంగా ఇచ్చే వారికి నేరుగా వీఐపీ హోదాలో వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని ఆయన వెల్లడించారు.

ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్ల విక్రయాలు జరుగుతాయని, ఆన్ లైన్ మాధ్యమంగా విరాళాలు ఇచ్చి టికెట్ రిసిప్ట్ పొందవచ్చని, ఐదవ తేదీన తిరుమలకు వచ్చి, దాన్ని చూపించి, ఆరు లేదా ఏడు తేదీల్లో దర్శనానికి వెళ్లవచ్చని ఆయన అన్నారు. ఇక ఆలయంలో అర్చకుల మధ్య తలెత్తిన వివాదమేదీ తన దృష్టికి రాలేదని సింఘాల్ స్పష్టం చేశారు. ఉత్సవ మూర్తులకు ప్రస్తుతం జరుగుతున్న సేవలను రద్దు చేసే విషయంలో ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News