Amarnath Reddy: తిరుపతిని రాజధాని చేయాలి.. ముగ్గురు సీఎంలను పెట్టాలి: టీడీపీ నేత అమర్నాథ్రెడ్డి
- మూడు రాజధానులు ఎందుకో అర్థం కావడం లేదు
- హామీలను నెరవేర్చలేక ఇలాంటి పనులు చేస్తున్నారు
- రాయలసీమ కోసం పోరాడేందుకు సిద్ధం
ఏపీకి మూడు రాజధానులు అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార వైసీపీ నేతలు దీన్ని సమర్థిస్తుండగా... విపక్షాలు తప్పుపడుతున్నాయి. అయినా, ప్రభుత్వం మూడు రాజధానుల దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తమకు మూడు ప్రాంతాలు సమానమేనంటూ ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించడం... దీనికి మరింత బలం చేకూరుస్తోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, మన రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకో అర్థం కావడం లేదని అన్నారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే పక్షంలో... తిరుపతిని కూడా రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండాలని అన్నారు. పాలించడం చేతకాక, ఎన్నికల హామీలను నెరవేర్చలేకే జగన్ ఇలాంటి పనులు చేస్తున్నారనిపిస్తోందని చెప్పారు. రాయలసీమ పరిరక్షణ కోసం పోరాడేందుకు కూడా సిద్ధమేనని అన్నారు.