amravathi: మందడంలో కొనసాగుతున్న బంద్.. పోలీసులకు నీళ్లు కూడా ఇవ్వకూడదని రైతుల నిర్ణయం
- మహిళలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా నేడు బంద్
- రోడ్లపైకి పెద్ద ఎత్తున చేరుకుంటున్న రైతులు
- పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వివాదం
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు అమరావతిలో కొనసాగుతున్నాయి. నిన్న ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ ఈ రోజు బంద్ జరుగుతోంది. జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఉదయం నుంచే మందడంలో బంద్ కొనసాగుతోంది. రైతులు ఉదయాన్నే రోడ్లపైకి చేరుకుని నిరసనకు దిగారు. దీంతో మందడంలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బందోబస్తుకు వచ్చిన పోలీసులకు నీళ్లు కూడా ఇవ్వకూడదని గ్రామస్థులు నిర్ణయించారు. అంతేకాదు, గ్రామంలోని దుకాణాల వద్ద పోలీసులు కూర్చోవడానికి కూడా వీల్లేదని రైతులు తెగేసి చెప్పారు. గ్రామంలోకి వెళ్లకుండా పోలీసు వాహనాలను అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. బంద్ చేపట్టిన రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.