Yadadri Bhuvanagiri District: హత్యలతో నాకెలాంటి సంబంధం లేదు...పోలీసులే ఇరికించారు: హాజీపూర్ నిందితుడు శ్రీనివాసరెడ్డి
- తానసలు ఫోన్ కూడా వాడనని న్యాయమూర్తి ఎదుట వాదన
- మరి స్మార్ట్ ఫోన్లో అశ్లీల చిత్రాలు ఎలా చూశావన్న జడ్జి
- సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన నిందితుడు
హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడైన శ్రీనివాసరెడ్డి నిన్న న్యాయమూర్తి ఎదుట గట్టిగా వాదించాడు. యువతుల మరణాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులే కావాలని తనను ఇరికించారని చెప్పుకొచ్చాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌కు చెందిన మనీషా, శ్రావణి, కల్పనల హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాసరెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిన్న పోలీసులు భారీ బందోబస్తు మధ్య హాజరు పరిచారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట నిందితుడు వాంగ్మూలం వినిపిస్తూ తానసలు ఫోన్ వాడడని చెప్పాడు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ మరి మూడు సిమ్ కార్డులు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నిం చారు. తన వద్ద బేసిక్ ఫోన్ మాత్రమే ఉందని జడ్జికి వివరించాడు.
ఈ వాదనను మధ్యలోనే అడ్డుకున్న న్యాయమూర్తి 'నువ్వు వాడేది బేసిక్ ఫోన్. మరి స్మార్ట్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నావని తేలింది. నీ నుంచి పోలీసులు రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదెలా సాధ్యం?' అని ప్రశ్నించారు. దీనికి శ్రీనివాసరెడ్డి సమాధానం ఇవ్వలేక మౌనం వహించాడు.
ఇప్పటికే ఈ మూడు హత్యలకు సంబంధించి కోర్టు 101 మంది సాక్షులను విచారించింది. తాజాగా శ్రీనివాసరెడ్డి వాదన నమోదుచేసి కేసును ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది.