Rapaka Vara Prasad: 'మూడు రాజధానుల' ఫార్ములాకు జనసేన ఎమ్మెల్యే రాపాక మద్దతు!
- మూడు రాజధానుల నిర్ణయం సరైనదే
- వైసీపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది
- మంచి చేస్తే మద్దతిస్తాం
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యవహారశైలి ఆ పార్టీ శ్రేణులకు విస్మయం కలిగిస్తోంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆలోచనా ధోరణికి విరుద్ధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. మీడియా ముఖంగానే కాకుండా, సాక్షాత్తు అసెంబ్లీలో సైతం వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఆయన మాట్లాడుతుండటం సంచలనం రేకెత్తిస్తోంది. తాజాగా ఆయన మరోసారి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలనే నిర్ణయం సరైందేనని రాపాక అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం హైదరాబాదును మాత్రమే అభివృద్ధి చేశారని... ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని చెప్పారు. నవ్యాంధ్రలో అలాంటి పరిస్థితులే మళ్లీ ఉత్పన్నం కాకూడదని అన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
అయితే ఈ నిర్ణయంతో అమరావతి రైతులకు ఇబ్బందేనని... వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. నవరత్నాల పేరుతో పలు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అభివృద్ది చేస్తోందని కితాబిచ్చారు. మంచి చేస్తే మద్దతిస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని చెప్పారు.