Nara Lokesh: ప్రతి వారం కోర్టు ముందు నిలబడే వ్యక్తిని చూసి ఎవరొస్తారు?: నారా లోకేశ్
- మూడు రాజధానుల ప్రతిపాదనపై విమర్శలు
- ఇండస్ట్రీలు పారిపోయాయంటూ వ్యాఖ్యలు
- ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. మూడు రాజధానులు కాదు రాష్ట్రంలో ముప్పై రాజధానులు ఏర్పాటు చేసినా ప్రతి వారం కోర్టు ముందు నిలబడే వ్యక్తిని చూసి అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఎవరు ముందుకు వస్తారు? అంటూ ట్వీట్ చేశారు.
తిరుపతిలో పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న జియో ఫోన్ల కంపెనీ రిలయన్స్ వణికిపోయిందని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకి రావడానికి సిద్ధపడిన పేపర్ ఇండస్ట్రీ పారిపోయిందని, విశాఖలో 70 వేల ఉద్యోగాలు తెచ్చే అదాని డేటా సెంటర్ ను, లులూ కంపెనీని తరిమేశారని విమర్శించారు. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు తప్ప అందులో అభివృద్ధి ప్రణాళిక ఏది? అంటూ ధ్వజమెత్తారు.