Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు
- రేపు వైకుంఠ ఏకాదశి
- అర్ధరాత్రి 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం
- భక్తులతో నిండిపోయిన తాత్కాలిక షెడ్లు
రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. పవిత్ర ఏకాదశి నాడు స్వామివారి దర్శనం చేసుకుంటే పుణ్యప్రదం అన్న భావన భక్తుల్లో ఉంది. అందుకు రద్దీగా ఉంటుందని తెలిసినా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుండడంతో తిరుమల కిటకిటలాడుతోంది. కాగా, ఈ అర్ధరాత్రి 2 గంటల నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఇప్పటినుంచే క్యూలైన్లలోకి చేరుకుంటున్నారు.
భక్తుల తాకిడి కారణంగా టీటీడీ అధికారులు నారాయణగిరి ఉద్యానవనం, నాలుగు మాఢవీధుల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. తాత్కాలిక షెడ్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇప్పటికే నిండిపోయింది. తాత్కాలిక షెడ్లు కూడా నిండిపోవడంతో క్యూలైన్లను కల్యాణ వేదిక వైపు మళ్లిస్తున్నారు. వైకుంఠ దర్శనాల సందర్భంగా తిరుమల కొండపైనా, తిరుపతిలోనూ 3,500 మంది శ్రీవారి వలంటీర్లు, 1300 మంది స్కౌట్లు భక్తులకు సేవలందిస్తున్నారు. ఏకాదశి రోజున కనుమ మార్గంలో 24 గంటలూ రాకపోకలకు అధికారులు అనుమతి ఇచ్చారు.