Amaravati: ఆర్థిక వనరులుంటే అక్కడే రాజధాని కట్టొచ్చు.. గ్రాఫిక్స్ లో మాదిరి ఎయిర్ ట్యాక్సీలూ పెట్టొచ్చు: విష్ణుకుమార్ రాజు
- విశాఖలో పునాదులకు ఆరేడడుగులు చాలు
- అమరావతిలో అలా కుదరదు
- అక్కడ చిన్న కల్వర్టు కట్టాలన్నా భారీ ఖర్చు
రాజధాని ఏర్పాటు విషయమై ఎన్ని కమిటీలు వేసినా విశాఖపట్టణం వైపే మొగ్గుచూపుతాయని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్టణంలో ఏ నిర్మాణానికి పునాదులు తవ్వాలన్నా ఆరేడడుగులకు మించి వేయాల్సిన అవసరం లేదని, ఈ భూములన్నీ అలాంటివని అన్నారు. నిర్మాణ వ్యయం తక్కువగా అవుతుందని, అంతేకాకుండా, రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా విశాఖ అనుకూలమని అభిప్రాయపడ్డారు. అదే, అమరావతిలో అయితే అలా కుదరదని, అక్కడి భూముులు వ్యవసాయం చేసేందుకే అనుకూలమని చెప్పారు. అమరావతిలో ఏ నిర్మాణం కట్టాలన్న ఎక్కువ అడుగుల్లో పునాదులు తవ్వాల్సి వస్తుందని, చిన్న కల్వర్టు కట్టాలన్నా భారీ ఖర్చు అవుతుందని అన్నారు.
సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ద్వారా అమరావతిలో భూములు విక్రయించి, ఆ వచ్చిన డబ్బును రాజధాని నిర్మాణానికి వినియోగించవచ్చని చంద్రబాబు చెబుతున్నారు కానీ, అది ప్రాక్టికల్ గా ఎంత వరకు సాధ్యం అని అనుమానం వ్యక్తం చేశారు. ఆర్థిక వనరులు బాగా ఉంటే.. అమరావతిలోనే రాజధానిని నిర్మించుకోవచ్చని, గ్రాఫిక్స్ లో చూపించినట్టుగా ఎయిర్ ట్యాక్సీలు పెట్టుకోవచ్చంటూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.