TJS: మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: టీజేఎస్ అధినేత కోదండరామ్
- రెండు రోజుల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తాం
- టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది
- ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయి
తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజుల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని అన్నారు. పార్టీ పరంగా రెండు కమిటీలను ఏర్పాటు చేశామని, అందులో ఒకటి మేనిఫెస్టో కమిటీ, మరోటి మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కమిటీ అని చెప్పారు.
ఈ రెండు కమిటీలు చాలా క్రియాశీలకంగా చాలా సమావేశాలు నిర్వహించాయని, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని, బోగస్ ఓటర్ల పేర్లు నమోదు చేశారని ఆరోపించారు.
వార్డుల విభజన ఖరారు వెనుక ప్రత్యర్థులను బలహీనపరచాలని, తన ప్రయోజనాలను బలోపేతం చేసుకోవాలన్న కుతంత్రం ఉందని ఆరోపించారు. ‘అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పైసలు వెదజల్లి గెలవాలనే ప్రయత్నం కనబడుతోంది’ అంటూ టీఆర్ఎస్ పై ఆరోపణలు చేశారు.