Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ... 3 గంటల్లోనే సర్వదర్శనం!
- ముగిసిన ముక్కోటి సందడి
- నిన్న మూసుకున్న వైకుంఠ ద్వారాలు
- సాధారణ దర్శనాలు మొదలు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలు ముగిసిపోవడంతో, తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. నిన్న రాత్రి 12 గంటల సమయంలో వైకుంఠ ద్వారాలను మూసివేశారు. ఆపై ఈ తెల్లవారుజాము నుంచి సాధారణ దర్శనాలు మొదలుపెట్టారు.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో స్వామి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి చూస్తున్నారు. వీరికి దర్శనానికి గరిష్ఠంగా 3 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, ప్రత్యేక, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 2 గంటల్లోనే దర్శనం పూర్తవుతుందని తెలిపారు. నిన్న శ్రీవారిని 90,578 మంది భక్తులు దర్శించుకున్నారని, 16,149 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ ఆదాయం 3.19 కోట్లని టీటీడీ అధికారులు తెలిపారు.