Deepika Padukone: జేఎన్‌యూకి ఎందుకు వెళ్లావు దీపిక? అంటూ ఛపాక్ సినిమా టికెట్లను రద్దు చేసుకుంటున్న అభిమానులు
- జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన దీపిక
- నెటిజన్ల ఆగ్రహం
- 10న విడుదల కానున్న సినిమా
- టాప్ ట్రెండింగ్‌లో ‘బాయ్‌కట్ ఛపాక్’ హ్యాష్‌ట్యాగ్
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే ఆ వర్సిటీ విద్యార్థులకు, అధ్యాపకులకు సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్‌తో పాటు ఆమె పలువురిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెపై కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ నటి దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో ఛపాక్ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమాను బ్యాన్ చేయాలని నెటిజన్లు అంటున్నారు. వారు క్రియేట్ చేసిన ‘బాయ్‌కట్ ఛపాక్’ అనే హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. జేఎన్‌యూకి ఎందుకు వెళ్లావు? అంటూ దీపికను ప్రశ్నిస్తున్నారు. తాము బుక్ చేసుకున్న టికెట్లను కొందరు రద్దు చేసుకొని వాటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.