Iran: ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు!
- టెహ్రాన్ సమీపంలో కూలిపోయిన ఉక్రెయిన్ విమానం
- క్రూ సిబ్బందితో పాటు ప్రయాణికులంతా మృతి
- మంటలు ఎక్కువగా ఉండటంతో ఎవరినీ కాపాడలేకపోయిన వైనం
ఈ తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. టెహ్రాన్ లోని ఇమామ్ ఖొమైనీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలోని క్రూ సిబ్బందితో పాటు, మొత్తం 165 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరాన్ అధికార మీడియా సంస్థ ఐఎస్ఎన్ఏ ప్రకటించింది.
తెల్లవారుజామును 6.12 గంటలకు బోయింగ్ విమానం టేకాఫ్ అయింది. ఎనిమిది నిమిషాల అనంతరం అది నేలకూలింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది. ఓ బంతిలా మండుతూ విమానం కూలిపోయింది. నేలను ఢీకొని పెద్ద శబ్దంతో పేలిపోయింది.
ఈ ప్రమాదంపై ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చీఫ్ మాట్లాడుతూ, మంటలు ఎక్కువగా ఉండటంతో... ఎవరినీ కాపాడలేకపోయామని తెలిపారు. ప్రమాదస్థలిలో 22 అంబులెన్సులు, 4 బస్ అంబులెన్సులు, ఒక హెలికాప్టర్ ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.