West Bengal: బెంగాల్ లో బస్సుపై దాడి.. వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో ఇదిగో!
- కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూభారత్ బంద్
- మద్దతు ప్రకటించిన వామపక్షాలు
- కూచ్ బిహార్లో బస్సుపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 10 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు ఈ రోజు భారత్ బంద్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సమ్మెకు వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది.
కూచ్ బిహార్లో ఆందోళనకారులు ఓ బస్ను ధ్వంసం చేశారు. తమ ప్రాంతంలోకి బస్సు రాగానే దానిపై రాళ్లు రువ్వి, దాని అద్దాలను పగులకొట్టారు. దీంతో అందులోని ప్రయాణికులు వణికిపోయారు. అనంతరం బస్సు దిగి వెళ్లారు. బస్సుపై దాడి చేసిన యువకులు ముఖానికి ముసుగులు ధరించి ఉన్నారు. దాడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది.
కాగా, దేశ వ్యాప్తంగా ఈ రోజు 25 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు సమ్మెలోకి దిగారు. బీఎంఎస్ మినహా అన్ని కార్మిక, రైతు, ఆటో సంఘాలు ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి.అయితే, ఈ సమ్మెకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించలేదు.