Amaravati: బస్సు యాత్ర చేయకూడదని ఎక్కడైనా ఉందా?: సీపీఐ నేత రామకృష్ణ
- సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ మెయిల్ చేయడం మానాలి
- చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలి
- ఇన్ సైడర్ ట్రేడింగ్ పై మాట్లాడే మంత్రులు కేసులు పెట్టలేదెందుకు?
ఏపీ రాజధాని కోసం పోరాడుతున్న 'అమరావతి పరిరక్షణ సమితి'కి పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతూ ఏర్పడ్డ జేఏసీ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. తాజాగా విజయవాడలో జరిగిన జేఏసీ సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రాజధానిపై మాట్లాడకూడదా ?.. ప్రతిపక్షాలు సమావేశాలు జరుపుకోకూడదని కాని, బస్సు యాత్రలు జరుపుకోకూడదని కాని ఎక్కడైనా వుందా? అని ప్రశ్నించారు.
నిన్న రాత్రి రైతుల బస్సుయాత్రను అడ్డుకున్న ప్రభుత్వం తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. సమస్య వచ్చిందని జేఏసీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. జేఏసీ ఏర్పాటుపై చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ మెయిల్ చేయడం మానాలని పేర్కొన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అసెంబ్లీలో పేర్లను చదివిన మంత్రులు కేసులు నమోదుచేసి ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ.. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధిని కొనసాగించాలన్నారు. సీఎం జగన్ సహనంతో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.