Vijayawada: సీఎం జగన్ మానసపుత్రిక ‘అమ్మఒడి’: మంత్రి వెల్లంపల్లి

  • విజయవాడలో ‘అమ్మ ఒడి’ని ప్రారంభించిన వెల్లంపల్లి
  • పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి ‘విద్య’
  • తల్లులను ఆదుకునేందుకే ‘అమ్మఒడి’

విజయవాడలో ‘అమ్మ ఒడి’ పథకాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఈరోజు ప్రారంభించారు. స్థానిక గాంధీజీ మునిసిపల్ హైస్కూల్ లో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం, ఆయన మాట్లాడుతూ, పిల్లల చదువు భారం కాకూడదని, వారికి తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి విద్యేనని అన్నారు. అందుకే, తల్లులను ఆదుకునేందుకే ‘అమ్మఒడి’ని తీసుకొచ్చామని చెప్పారు.

ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.15 వేలను ప్రతి తల్లి బ్యాంకు అకౌంట్ ఖాతాలో నేరుగా జమ చేస్తున్నట్టు చెప్పారు. దాదాపు  43 లక్షల మంది తల్లులకు ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద తమ పేర్లు నమోదు చేసుకున్న తల్లులందరికీ దీనిని వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, మంచి జీవితాన్ని పొందాలని ఆకాంక్షించారు.

సీఎం జగన్ మానసపుత్రిక ‘అమ్మఒడి’ అని, ముఖ్యమంత్రి అయిన ఏడు నెలల కాలంలోనే ‘నవరత్నాలు’ అమలు చేస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. ‘నాడు- నేడు’ కార్యక్రమంతో అన్ని పాఠశాలలను ఏడాది కాలంలో ఆధునికీకరిస్తామని, ఉగాదికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఆయన విమర్శలు గుప్పించారు. వీళ్లిద్దరికీ ‘అమరావతి’ తప్ప ప్రజల సంక్షేమం పట్టదని అన్నారు. అనంతరం, కలెక్టర్ ఇంతియాజ్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ శ్రేణులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News