Chandrababu: మీ సెల్ ఫోన్లన్నీ ఆన్ చేయండి.. ఆ లైట్ల వెలుగు చాలు: చంద్రబాబు
- కావాలనే కరెంట్ తీసేశారు
- బస్సు యాత్రను అడ్డుకున్నారు
- వైఎస్సార్ దొంగలతోనే లా అండ్ ఆర్డర్ సమస్య
రాజధాని అమరావతి కోసం మచిలీపట్నంలో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రజా సంఘాలు జోలె పట్టి విరాళాలు సేకరించాయి. ఇక్కడి కోనేటి కట్ట సెంటర్ లో చంద్రబాబు భారీ జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం ప్రారంభించే సమయానికి కరెంటు పోవడంతో సభకు హాజరైన అందరినీ సెల్ ఫోన్లు ఆన్ చేయాలని సూచించారు.
తాను మాట్లాడుతుంటే కావాలనే కరెంట్ తీసేశారని, మీ సెల్ ఫోన్ల వెలుగు చాలని, ఈ ప్రపంచానికి సందేశం అందిద్దామని సభికుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన కాసేపటికే కరెంట్ రావడంతో తానంటే భయపడి కరెంట్ ఇచ్చారని చమత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జేఏసీ తరఫున బస్సు యాత్రకు సంకల్పిస్తే పోలీసుల సాయంతో అడ్డుకున్నారని ఆరోపించారు.
ఆ బస్సులకు రవాణా శాఖ అనుమతి కూడా తీసుకున్నారని, కానీ పోలీసులు చివర్లో వచ్చి తమ పర్మిషన్ తీసుకోవాలంటూ జులుం చేశారని ఆరోపించారు. తాను 14 ఏళ్లు సీఎంగా చేశానని, బస్సు యాత్రకు పోలీసుల పర్మిషన్ ఎందుకు తీసుకోవాలో అర్థం కాలేదని అన్నారు. బస్సులను ఎందుకు ఆపేశారని అడిగితే, రూట్ మ్యాప్ ఇవ్వలేదని అందుకే ఆపేశామని చెప్పారని వివరించారు.
"నిన్ననే డీజీపీ అపాయింట్ మెంట్ అడిగాం. అయినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు మరో లేఖ ఇస్తున్నాం, పర్మిషన్ ఇవ్వండి అంటే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది అందుకు పర్మిషన్ నిరాకరిస్తున్నామని ఆ పెద్ద మనిషి చెప్పాడు. అయినా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య ఎక్కడుంది? వైఎస్సార్ దొంగలతోనే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది" అంటూ ప్రసంగించారు.