Chandrababu: నీకు మంత్రి పదవి ఎందుకు... సిగ్గుందా అసలు!: పేర్ని నానిపై చంద్రబాబు ఫైర్
- మచిలీపట్నంలో చంద్రబాబు ప్రసంగం
- వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు
- నవరత్నాలు కాదు నవగ్రహాలంటూ విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబు మచిలీపట్నం ప్రజా చైతన్య యాత్రలో నిప్పులు చెరిగేలా ప్రసంగించారు. అమరావతి కోసం జోలె పడితే ముసలీ ముతకా వాళ్లు కూడా వంద, యాబై, పది రూపాయలు కూడా తీసుకువచ్చి జోలెలో వేశారని చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. తమవంతుగా అమరావతి కోసం ఇస్తున్నామంటూ స్ఫూర్తి ప్రదర్శించారని కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో పాటు స్థానిక మంత్రి పేర్ని నానిపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
"సీఎం జగన్ గారూ ఇదంతా చూస్తుంటే మీకు బాధనిపించడంలేదా? ఇక్కడుండే నానీ నీకు బాధ కలగడంలేదా? అని అడుగుతున్నాను. నీకు ఎందుకు మంత్రి పదవి? అసలెందుకీ మంత్రి అని అడుగుతున్నా. రాజధాని మార్చుతుంటే సిగ్గు లేకుండా ఆ కమిటీలో ఉన్నావు. మీరా మాకు నీతులు చెప్పేది? నన్ను ఇంకా తిడుతున్నారు. ఇవాళ కూడా ఒకాయన తిట్టారు. నేను లుచ్ఛాలా కనిపిస్తున్నానట. ఫర్వాలేదు. నన్ను తిట్టండి, బాధపెట్టండి... కానీ నాపై కోపాన్ని ప్రజలపైనా, అమరావతిపైనా చూపించొద్దు. ఒక్క పిలుపు ఇస్తే 33 వేల ఎకరాలు ఇచ్చారు. ఒక్క రూపాయి తీసుకోకుండా లాండ్ పూలింగ్ లో ఇచ్చారు. వీళ్లు రియల్ ఎస్టేట్ అంటున్నారు.
ఇప్పుడు రైతులు గుండె ఆగి చనిపోతుంటే మీకు సిగ్గనిపించడం లేదా, మీరసలు మనుషులేనా?. అభివృద్ధి చేయమంటే డబ్బులు లేవంటారు. డబ్బులెందుకు, పని చెయ్యండి చాలు. అమరావతి బంగారుగుడ్డు పెట్టే బాతు వంటిది. దాన్ని చంపేశారు. ఇప్పుడు రాజధానిని విశాఖపట్నం తీసుకెళుతున్నారు. ఎవరు అడిగారు విశాఖపట్నం రాజధాని కావాలని? ఇక్కడి వాళ్లకు అన్యాయం చేసి తాము బాగుపడాలని విశాఖపట్నం ప్రజలు ఎప్పుడూ కోరుకోరు. విశాఖ ప్రజలు నీతినిజాయతీ ఉన్నవాళ్లు.
హుద్ హుద్ తుపాను సమయంలో విశాఖ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపాను. ప్రధాని మోదీ వచ్చి అక్కడి ప్రజల్లో ఉత్సాహం చూసి నన్ను అభినందించారు. విపత్తు సమయంలోనూ ప్రజలు ఇంత నిబ్బరంగా ఉండడం తాను సీఎంగా ఉన్నప్పుడు కూడా చూడలేదని మోదీ అన్నారు. విశాఖపట్నం సుందరమైన నగరం, మంచివాళ్లుండే ప్రదేశం. అలాంటి బీచ్ లు చాలా తక్కువ ప్రాంతాల్లోనే ఉంటాయి. ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ వాటన్నింటినీ వెనక్కి పంపి పుణ్యం కట్టుకున్నారు. నేను తెలివితో అనేక పనులు చేశాను. నీకసలు తెలివే లేదు. ఈ తెలివి అరికాల్లో ఉంది, అదే సమస్య. వక్రబుద్ధి, చెడు ఆలోచనలు, నేర ప్రవృత్తి తప్ప మరోటి కాదు. నవరత్నాలు అంటూ తిరుగుతున్నాడు. అవి నవరత్నాలు కాదు, నవగ్రహాలు. ఆ శనిని వదిలించుకోవాలంటే నవగ్రహాల చుట్టూ మనం తిరగాలి" అంటూ విమర్శలు గుప్పించారు.