Jallikattu: చిత్తూరు జిల్లా జల్లికట్టు పోటీలకు వచ్చిన తమిళనాడు యువకులు... తీవ్ర ఉద్రిక్తత!
- రామకుప్పం మండలంలో జల్లికట్టు
- అనుమతి లేకున్నా నిర్వహణ
- తమిళనాడు యువకులతో స్థానిక యువకుల ఘర్షణ
సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ జల్లికట్టు పోటీలు చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్ల గ్రామంలో ఉద్రిక్తతలను పెంచాయి. తమిళనాడు సరిహద్దుల్లోని ఏపీ గ్రామాల్లో జల్లికట్టు జరుగుతుందన్న సంగతి తెలిసిందే. బల్ల గ్రామంలో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొనేందుకు తమిళనాడు నుంచి కొందరు యువకులు వచ్చి, అత్యుత్సాహాన్ని ప్రదర్శించగా, స్థానిక యువకులు అడ్డుకున్నారు.
వీరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఐదుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో జల్లికట్టుకు అనుమతి లేదని, అయినా నిర్వాహకులు వినకుండా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. జల్లికట్టు సందర్భంగా గ్రామంలో మద్యం ఏరులై పారుతున్నా, అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఉద్రిక్తతలకు అదే కారణమని స్థానిక ప్రజలు ఆరోపించారు.