Jagan: సీబీఐ కోర్టు న్యాయమూర్తికి జగన్ విన్నపం.. సీబీఐ అభిప్రాయాన్ని కోరిన జడ్జి!
- వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి
- సహ నిందితుడు నా తరఫున హాజరవుతాడు
- న్యాయమూర్తికి తెలిపిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తనపై ఉన్న అక్రమాస్తుల కేసులో తొలిసారిగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు విచారణకు హాజరైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇకపై తనకు ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు.
తాను కీలకమైన పదవిలో ఉన్నందున కోర్టుకు హాజరు కాలేనని, తన తరఫున కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది కోర్టు ముందు ఓ పిటిషన్ వేయగా, న్యాయమూర్తి దానిని పరిగణనలోకి తీసుకుని సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ, విచారణను తదుపరి శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. జగన్ కోర్టులో రెండు గంటల పాటు వున్నట్టు తెలుస్తోంది.
ఈ కేసులో ప్రధాన నిందితులంతా నేడు కోర్టుకు హాజరు కావడంతో, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో ఇతర కేసుల్లో కక్షిదారులకు, న్యాయవాదులకు కొంతమేర ఇబ్బందులు కలిగాయి.