Telangana: కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ రెబల్ నేత దయాకర్ రెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
- మంత్రి మల్లారెడ్డి అనుచరుడిగా గుర్తింపుపొందిన దయాకర్ రెడ్డి
- మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్న రేవంత్
- కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపు
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతూండగా, మరోపక్క కాంగ్రెస్ అధికార పార్టీ నేతలను పార్టీలోకి చేర్చుకుంటూ గెలుపు తమదే అంటోంది. టీఆర్ఎస్ రెబల్ నేత దర్గ దయాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈ రోజు కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేస్తుందన్నారు. మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. డబ్బులతో, అక్రమ కేసులతో రాజకీయాలు చేయానుకునేవారికి తాజా పరిణామాలు కనువిప్పు అని పేర్కొన్నారు. పీర్జాదిగూడలో కాంగ్రెస్ గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ వార్డులన్నింటినీ సొంతం చేసుకుంటుందన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందరికీ అండగా నిలబడతానని రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాగా, దయాకర్ రెడ్డి ఇన్నాళ్లూ మంత్రి మల్లారెడ్డికి అనుచరుడిగా కొనసాగారు. ఆయన మల్కాజ్ గిరి పరిధిలోకి వచ్చే పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఆశించినట్టు, దీనికి టీఆర్ఎస్ అధిష్ఠానం అంగీకరించకపోవడంతో ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది.