Chidambaram: భారతీయులు ఒట్టి అమాయకులు...ఏది చెప్పినా నమ్మేస్తారు: చిదంబరం
- కేంద్ర ప్రభుత్వాన్నీ అంతే గుడ్డిగా నమ్ముతున్నారు
- ఆయుష్మాన్ పథకం దేశమంతా వర్తిస్తుందంటోంది కేంద్రం
- అసలు పథకం గురించే తెలియదంటున్నారు వైద్యులు
భారతీయులు ఒట్టి అమాయకులని, ఏది చెప్పినా నమ్మేస్తారనీ, అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణ 'ఆయుష్మాన్ భారత్' పథకం అని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
భారతీయులంతటి అమాయకులను ప్రపంచంలో తానెక్కడా చూడలేదన్నారు. గ్రామాలన్నింటికీ విద్యుత్ వెలుగులు ఉన్నాయన్నా నిజమే అనుకుంటారు. అన్ని ఇళ్లకు మరుగుదొడ్లున్నాయన్నా ఒప్పుకుంటారు. అందుకే కేంద్రం ఏ కొద్దిమందికోగాని తెలియని 'ఆయుష్మాన్ భారత్' పథకం దేశం మొత్తం అమలైపోతోందంటే నిజమేనని సంబరపడిపోతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
'ఢిల్లీలో నా డ్రైవర్ తండ్రికి సుస్తీ చేసింది. సర్జరీ జరిగింది. ఆయుష్మాన్ భారత్ వర్తింపజేయమన్నాం . అక్కడి వైద్యులు అసలా పథకం గురించే మాకు తెలియదు అనడంతో కంగుతిన్నాం' అంటూ చిదంబరం చెప్పుకొచ్చారు. ఎందుకూ కొరగాని పథకాన్ని అందరికీ వర్తింపజేస్తున్నామని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. కేంద్రం వెల్లడిస్తున్న చాలా నివేదికలు తప్పుల తడకన్నారు.